ఆ కుర్రాడి పేరు బైర్రాజు. చాలా హుషారు. అమ్మాయిల మనసుల్లో ఏముందో.. ఇట్టే కనిపెట్టేస్తాడు. లిప్‌స్టిక్ పూసుకొన్న పెదాలు అబద్ధాలాడినా.. కాటుక దిద్దిన కళ్లు మాత్రం నిజమే చెప్పేస్తాయట. ఈ కిటుకుతోనే ఓ ముద్దుగుమ్మని ప్రేమలో దించేశాడు. ఈ ప్రేమ పెళ్లి పీటల వరకూ తీసుకువెళ్లడానికి ఏం చేశాడో తెలియాలంటే 'జబర్‌దస్త్' సినిమా చూడాల్సిందే. సిద్దార్థ్, సమంత జంటగా నటించిన చిత్రమిది.
శ్రీహరి కీలక పాత్రధారి. నందినిరెడ్డి దర్శకత్వం వహించారు. బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మాతలు. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ''హుషారైన ఓ ప్రేమ జంట కథ ఇది. ప్రతి పాత్రా మస్త్ వినోదాన్ని పంచుతుంది. అందుకే జబర్‌దస్త్ అని పేరుపెట్టాం.
ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది. కుటుంబ సమేతంగా చూసేలా దర్శకురాలు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దింది. సిద్దార్థ్, సమంత పాత్రలు గుర్తుండిపోతాయ''న్నారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సాయాజీషిండే, సురేష్, రమేష్, వేణు, కాశీ విశ్వనాథ్, ప్రగతి తదితరులు నటించారు.
ప్రేమ అంటే చదరంగం లాంటి ఆటగా మారిందనే విషయం తెలియని యువకుడతను. ఓ అందాల భామను మనసారా ప్రేమిస్తాడు. కానీ ఆమె ఆలోచనలు వేరుగా ఉంటాయి. అప్పుడా యువకుడు ఏం చేశాడో తెర మీదే చూడమంటున్నారు తారకరత్న. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'విజేత'. శ్వేతబసు, రచనామౌర్య నాయికలు.
ఉదయ్‌భాస్కర్.పి దర్శకుడు. మార్చి 1న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ ''ఇందులో ప్రేమే కాదు మనసుని హత్తుకునే కుటుంబ బంధాలు కూడా ఉన్నాయి. తారకరత్న నటన ఆకట్టుకుంటుంద''న్నారు. కృష్ణుడు, అశోక్‌కుమార్, వైజాగ్ ప్రసాద్, చంటి, సన తదితరులు ఇతర పాత్రధారులు. సంగీతం: అర్జున్, సమర్పణ: వి.దొరస్వామిరాజు.
0 కామెంట్‌లు: